"ఎరుక సెబుతానమ్మ! ఎరుక సెబుతాను. జరిగింది సెబుతాను. జరగబోయేది చెబుతాను. అలా కూసోతల్లా! సుందరంగా ఉన్నావే బాపనోరి సుందరమ్మా! ఏది సేయి ఇలా సాపు. లంకంత కోటలాంటి ఇంట్లో మహారాణీ భోగమే నీది. అయినా నీకు లోపం జరుగుతున్నదే తల్లి. దానికి కారణం సెబుతానె ఇనుకోవే అమ్మ" 'ఊ...' అంటూ చేతికర్ర నెత్తికి తాకిస్తూ కళ్ళు మూసుకుని తెరిచింది ఎరుకలసాని. ఆనందంగా ఎరుకలసాని దగ్గరకు జరిగి "నా పేరు సుందరమ్మ అని నీకు ఎలా తెలుసు అంత కరెక్ట్‌గా ఎలా చెప్పగలిగావు?" అని అడిగింది.
"పొరపాటు. పొరపాటే అమ్మ! అమ్మను శంకిస్తే నీ బతుకు బుగ్గి అయిపోతుందే. అడిగింది అడిగినట్లు మనస్సు పెట్టి మరీ సెప్పు" అంటూ ఆగింది. ఇల్లంతా కలియజూసింది ఎరుకలసాని. అమ్మో! అంటూ బుగ్గలు నొక్కుకుంది. మళ్ళీ తానే కలగజేసుకుని "నీ మగడు కోటీశ్వరుడే తల్లీ! కలిగినోరింట పుట్టావే! కట్న కానుకలు దండిగా తెచ్చినావే! అవునామరి" అడిగింది.
సుందరి భయం భయంగా అటూ ఇటూ చూసింది. ఎరుకలసానితో "ఔను మా పుట్టింటోళ్ళు పదెకరాల మాగాణి, రెండెకరాల అంటు మావిడి తోట నాకు పసుపుకుంకాలు క్రింద ఇచ్చారు. నాకు నా భర్త నూరు కాసుల బంగారు నగలు చేయించాడు. కేజీ దాకా వెండి పళ్ళెం, గ్లాసు, పాందాను వగైరాలు చేయించాడు. ఊరుకు ఉత్తరాన ఎనభై ఎకరాల పొలం మాది. మా ఆయన పేరు శ్రీకృష్ణ ప్రసాద్. ఎప్పుడూ గుర్రం దిగడు. స్ఫురద్రూపి. నాకు పిల్లలు కలగలేదని చెప్పేసి, అమాయకురాల్ని అని నా చేత రాయించుకుని మరో పెళ్ళి చేసుకున్నాడు. నాకో సవతిని తెచ్చిపెట్టాడు. అలా చేసినా కూడా, నన్ను బాగానే చూస్తారులే! ప్రతీ ఏటా ఏడు ఎనిమిది లక్షల అదాయం దాటి వసుతుంది. నా పేర, మా సవతి పేర బోలెడంత డబ్బు, కొన్ని కంపెనీలలో వాటాలు పెట్టారు" అంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పింది.
'ఇక్కడ కూర్చుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే బాగుండదు. లోనికెళ్దాం రా!' అని ఎరుకలసానిని సుందరమ్మ లోనికి ఆహ్వానించింది. పనిమనిషిని పిలిచి ఆమెతో సుందరి ఈమెకు ఏమైనా తినడానికి తెచ్చిపెడుతూ, మజ్జిగ దాహం కూడా తీసుకురా మర్చిపోకు అంటూ పురమాయించింది. అరడజను అమృతపాణి అరటిపళ్ళు, మజ్జిగ దాహం తెచ్చి పనిమనిషి ఎరుకలసానికి ఇచ్చింది. ఆమె పళ్ళుతిని, మజ్జిగ దాహం పుచ్చుకుని గర్రున తేంచింది. వచ్చిన పని గుర్తుకొచ్చి 'మీ ఆయన ఊళ్ళో లేడా?' అని ఎరుకలసాని ప్రశ్నించింది. దానికి "లేరు, రేపుగాని రారనుకుంటా. ఏవో లంక పాటలు అవీ ఉన్నాయని పనుండి కాకినాడ వెళ్ళుతున్నానని గుమాస్తాతో చెబుతుంటే విన్నాను" అంది.ఎరుకలసాని లేస్తూ నేవస్తానమ్మా! అన్నట్టు మీ సవతి ఎక్కడుంటుంది? మీ పడక వగైరాలు ఎక్కడ అంటూ ఆరాలు తీసింది. సుందరమ్మ తానుండే పోర్షన్, పడకగది అన్నీ చూపించింది. తన సవతి జోగులాంబ మేడమీద పోర్షన్లో ఉంటుంది. అని దాన్ని వేలెట్టి చూపించింది. నేనంటే ఆయనకు మొదట్లో ఎంతో ఇష్టం. నాపేరు సుందరమ్మ కదూ! అందుకని ఎప్పుడూ 'సుందరి, సుందూ' అంటూ ఆప్యాయంగా పిలుస్తారు అని చెబుతూ ఎంతో సిగ్గుపడి పోయింది. ఆ ఎరుకలసాని తన దారిని తాను పోతున్నట్లుగా సుందరమ్మతో 'మంచిది వస్తానమ్మా!' అని వెళ్ళిపోయింది.
అర్ధరాత్రి వేళ రెండు నల్లని బలిష్ఠమైన ఆకారాలు శ్రీకృష్ణ ప్రసాద్ గారి ఇంటి కాంపౌండు గోడలు దాటి లోపలికి వచ్చాయి.లోపల్నుంచి గేటు తలుపులు తెరిచారు. ఇద్దరు గేటు దగ్గర కొత్తగా వచ్చిన ఆగంతకులు కాపలా ఉన్నారు. ఒక నల్లని పంజాబీ డ్రెస్ వేసుకున్న స్త్రీ లోనికి వచ్చింది. ఆమె గోడ దూకి వచ్చిన ఇద్దరితో కలిసి ఏదో ఆచూకి చెప్పసాగింది. శ్రీకృష్ణ ప్రసాద్ గారి ఇంటిముందు ఆర్అండ్బి రోడ్డు దానికి ఆనుకుని కాలువ పక్క అల్లంత దూరంలో పెద్దపేట, చిన్నపేట అనే పేర్లు కలిగిన హరిజన కాలనీలు ఉన్నాయి. ప్రసాద్ గారి పనుల్లోకి వచ్చి పని చేస్తూ బ్రతుకుతారు కోందరు. కొందరైతే మిలటరీ సర్వీసులో పనిచేసి విశ్రాంతి పొందే ఎక్స్మిలట్రీవాళ్ళు. వీళ్ళూ వాళ్ళూ అనే ప్రసక్తి లేకుండా ప్రసాద్ అంటే అందరికీ అభిమానం ఎక్కువే!గేటు దగ్గర లైట్లు వేసి వున్నాయి. మనుష్యులిద్దరు కనిపిస్తున్నారు. నెమ్మదిగా లోనికి వెళ్ళీన వాళ్ళలో ఒకడు తలుపుకొడుతూ 'సుందరీ!' అంటూ ఆప్యాయంగా పిలిచాడు. అప్పటీకే మాగన్నుగా రెప్పపట్టిన సుందరమ్మకి మెలకువ వచ్చింది. లేచి వెళ్ళి తలుపు తీసింది. ఆ పిలుపు తన భర్తదై ఉంటుంది అనుకుంది, కాని కాదు. ఎదురుగా తుమ్మ మొద్దులాంటి శరీరాలు, జుట్టు చేతికి దొరకనంతగా అంటకత్తెర్లు వేయించుకున్నారు. వళ్ళంతా ఆముదం రాసుకున్నట్టున్నారు. కరెంటు లైటు వేసిందేమో, ఆ లైటు కాంతిలో కాటుక కొండలాంటి వాళ్ళ శరీరాలు నిగనిగలాడుతున్నాయి.
కంగారు పడుతూనే , 'ఎవరు మీరు ఎందుకొచ్చారు?' అంటూ ప్రశ్నించింది సుందరమ్మ. అందులో ఒక మొరటు మనిషి "తాళాలు ఇలాగియ్యి" అన్నాడు. ' ఆ .. తాళాలు నాదగ్గర ఎక్కడుంటాయి? మీరెవరో చెప్పండి ముందు' అని గద్దిస్తున్నట్లుగా మాట్లాడింది. వాడు చేతికి దొరికిన కర్రతో ఆమె నెత్తిమీద ఒక్కటి కొట్టాడు. ఆమె అబ్బా! అంటూ కుప్పకూలి పోయింది. సుందరమ్మ ఉండే పొర్షన్, ఆమె పడక గది వగైరాలన్నీ ఆ కూడా వచ్చిన స్త్రీ ఇచ్చిన ఆచూకీతో వెదికారు. వంద కాసుల బంగారు నగలు దొరికాయి. ఒక కేజీ బరువు వుండే వెండి సామాను కూడా దొరికింది.
శ్రీకృష్ణ ప్రసాద్ రెండో భార్య జోగులాంబ ఉండే మేడమీద పోర్షన్ వైపు నడిచారు. తలుపు తట్టగానే ఇంత రాత్రివేళ ఎవరై ఉంటారు, తన భర్తే అనుకుని తలుపు తీసింది. క్రింద ఏదొ చప్పుడు అవుతున్న శబ్దం వినిపించింది. గుండె బేజారయింది జోగులాంబకి. బాల్కనీలోకి వేగంగా వెళ్ళి క్రిందకు చూసింది. అదేమంటే రాత్రి జమీందారింట్లో కాపలా పడుకునే భద్రయ్య, పనిమనిషి కాసులు ఏదొ అలికిడి వినిపించి వంట షెడ్డులో పడుకున్న వాళ్ళు లేచారు. పరిగెట్టుకుని గేటు దగ్గర మనుష్యుల్ని చూసి బిత్తరపోయారు. ఎవరు మీరని భద్రయ్య వాళ్ళతో కలబడి పోయాడు. కాసులు చేతిలో అట్లకాడ ఉంది. ఆ దొంగలు ఇద్దరు భద్రయ్యను, కాసులును నాలుగు బాదారు. లోపలి వరండాలోకి తీసుకొచ్చి చెరో స్థంభానికి తాళ్ళతో కట్టిపడేసారు. నోట్లో గుడ్డలు కుక్కేసారు మాట్లాడకుండా. జోగులాంబ క్రిందకు దిగనియ్యకుండా యమభటుల్లా పైనున్న దొంగలు దగ్గరగా వెళ్ళారు.
ముఠా నాయకుడు జోగులాంబని ఇనప పెట్టె తాళాలు ఇమ్మని హుంకరించాడు. ఆమె నేను ఇవ్వనని మొరాయించింది."భద్రయ్యా, కాసులు ఎక్కడున్నార్రా? రండి" అని గట్టిగా అరవబోయింది. వాడు ఆమె పీకకి కత్తి అడ్డంగా గురిపెట్టి "నోరు ఇంకోసారి పైకి లేచిందా! నిష్కారణంగా చస్తావ్! తే తాళాలు" అన్నాడు. అయినా సరే జోగులాంబ అతనికి తాళాలు ఇవ్వలేదు. పంజాబీ డ్రెస్‌లో వచ్చిన స్త్రీ పక్కన కనిపిస్తున్న మరచెంబు తీసి జోగులాంబ నెత్తిమీద ఒక దెబ్బ ఒక మోస్తరుగా తగిలేలా కొట్టింది. ఆమె తలనుంచి రక్తం కారసాగింది. జోగులాంబకు ఊటీలో చదువుకుంటున్న కొడుకు, కూతురు గుర్తుకొచ్చారు. అమ్మా! అంటూ అక్కడే నేలమీద చతికిలపడిపోయింది. ప్రాణభీతితో మొలనున్న తాళాల గుత్తి తీసి వాళ్ళమీదకు విసిరేస్తూ "నన్ను చంపకండి" అంటూ ఏడుస్తూ బ్రతిమలాడింది.
లోపల మొత్తం నలుగురు దొంగలు ఏకమై జోగులాంబ గదిలో ప్రవేశించారు. వారి కూడా ఉన్న పంజాబీ డ్రెస్ వేసుకున్న స్త్రీ శ్రీకృష్ణ ప్రసాద్ గారి గదినీ చూపించింది. ఆమె గదిలో కూడా వంద కాసుల పై చిలుకే బంగారం, పూర్వపు నగలైన వడ్డాణము, కంటి, పట్టాలు, కాసుల పేరు, చంద్రహారాల గొలుసు రూపేణా దొరికాయి. కేజీ వెండి వస్తువులు దొరికాయి. సొమ్ము ఏదో వందల్లో తప్ప దొరకలేదు. అవన్నీ మూటలు కట్టుకుని హాల్లోకొచ్చాడు నాయకుడూ, మరొకడూ. మిగిలిన ఇద్దరూ డబ్బుకోసం ఎంతగానో గాలించినా ప్రయోజనం లేకపోయింది. జమీందారు పడుకునే మంచం మీద పరుపులూ, దిళ్ళు, వాటిల్లో సొమ్ము దాచాడేమోనని, కత్తులతో కోసేశారు. ప్రయోజనం లేకపోయింది. వంట గదిలోంచి కంచాలలో అన్నం పెట్టుకుని పెరుగు పొసుకుని ఒకళ్ళిద్దరు పెరుగన్నం తిన్నారు. మరొకడు పెరట్లోకెళ్ళి నూతిపళ్ళెం మీద బహిర్దేశానికి వెళ్ళి ఆనూతిలో నీళ్ళు తోడి కడుక్కుని చక్కా వచ్చేశాడు. అది వాళ్ళకి కన్నం పారినట్టు నమ్మకం గావును. బయట లైట్లు చూసి పెదపేట, చిన్నపేట జనం కొందరు అక్కడ కృష్ణ ప్రసాద్ గారి మేడలో ఏదో జరుగుతోందని ఊహించారు. రావడానికి మాత్రం సాహసం చెయ్యలేదు ఏ ఒక్కరూ!
తొలికోడి ఎక్కడో కూసినట్లైంది. వేగంగా అంతా దొరికిన నగల్ని దొరికినట్లుగా మూటముల్లే సరిజేసుకుని దొంగలు ఐదుగురూ రోడ్డు ఎక్కారు. రాజమండ్రి వైపు పోతున్న క్వారీ లారీని అటకాయించి ఎక్కుతామని అడిగితే డ్రైవరు ఒప్పుకోలేదు. నాయకుడు కత్తి చూపించాడంతే! డ్రైవరు ఎక్కండి అని సైగ చేయగానే మొత్తం ఎక్కికూర్చున్నారు.
* * *
ఉదయం ఎనిమిది గంటలు కావస్తుండగా శ్రీకృష్న ప్రసాద్ ఊళ్ళో ప్రవేశించాడు. జాతి గుర్రం పరుగు, డెక్కల చప్పుడు వినిపించేటప్పటికి ఆ ఇంట్లో పనిచేసే మనుష్యుల గుండెల్లో గుబులు ఆవహించింది. తన ఇంటి ముందు గుర్రం దిగాడు ప్రసాద్ జమిందార్. అశ్వశిక్షకుడు ఖాదర్ అప్పుడే డూటీలోకి వచ్చినట్టున్నాడు. గుర్రం కళ్ళెం చేతిలోకి తీసుకుని శాలవైపు నడిచాడు. దాని వంటిమీద జీను విప్పాడు. బ్రష్‌తో ఒళ్ళంతా దువ్వి దాన్ని ఆరాం చేశాడు. అప్పటికే బంధవిముక్తుడైన భద్రయ్య యజమాని ఇంట్లోకి ప్రవేశించగానే విషయం సాంతం చెవిలో వేసాడు. దొంగలు కన్నం పారినట్లుగా చేసిన తిండి ముచ్చట, చండాలం చేసిపోయిన భోగట్టా కూడా చెప్పాడు.
ఒక్కసారి నిట్టూర్చాడు శ్రీకృష్ణ ప్రసాద్. కొద్దిసేపట్లో భార్యలిద్దర్నీ దొంగలు కొట్టింది, దోచిందీ వివరాలు కనుక్కున్నాడు. ముందు భార్య సుందరమ్మ దగ్గరకు జోగులాంబతో పాటు వచ్చాడు. చీకాకుతో "సుందరీ! నీకు బుద్ధి ఎప్పుడొస్తుందే! ఇంటికి దెష్టాకోరు, పొరుక్కి శివాలక్ష్మి అన్నట్టు వచ్చిన వారు ఎవరయ్యింది తెలుసుకోకుండా, అందరి దగ్గరా ఉన్నవీ, లేనివీ అన్నీ వాగేస్తావు. అసలే రోజులు బాగుండలేదంటే వినవు" అంటూ కేకలేసాడు. సుందరి మాట్లాడలేదు. చిన్న భార్య జోగులాంబ భర్తనుద్దేశించి "అన్నట్టు ఏవండీ! వాళ్ళతో ఒక ఆడదొంగ కూడా వచ్చింది. తాళాలు ఇవ్వనన్నానని నన్ను మరచెంబుచ్చుకుని కొట్టింది" అంటూ దెబ్బ తడుముకుని బాధపడింది. సుందరి ఏదో గుర్తుకొచ్చినట్టు " ఔనండోయ్! ప్రొద్దుట నా దగ్గరకు ఎరుక చెబుతానంటూ ఓ ఎరుకలసాని వచ్చింది. అదే నన్ను అన్ని వివరాలు అడిగింది. ఇల్లంతా పారజూసినట్లు జ్ఞాపకం" అంది. "ఆ దొంగపీనుగే నన్ను మరచెంబుచ్చుకుని కొట్టింది" అంటూ మెటికలు విరిచింది జోగులాంబ. ఇంక అనుమానం లేదు ఆమె ఈమె ఒక్కతేనని పనిమనిషి కాసులు గొణిగింది.
" అఘోరించినట్లున్నాయి మీ తెలివితేటలు. దద్దమ్మలు. నోరు మూసుకోదీ సుందరి. ఎవరితో బడితే వాడితో ఎంతసేపూ లొడలొడ మాట్లాడేసుతుంటుంది. కొంపముంచుతుంటుంది" అని అక్కడనుంచి విసుక్కుంటూ వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ ప్రసాద్.
ఆలశ్యం చేయకుండా తనకు అత్యంత ఆప్తుడైన ఎస్పీకి ఫోన్ రింగ్ చేసాడు శ్రీకృష్ణ ప్రసాద్. అవతలి వ్యక్తి ఫోన్లో దొరకగానే ఆనంద పడాడు. జరిగిన దొంగతనం అంతా పూసగుచ్చి అతనికి చెప్పాడు. బంగారు, వెండి నగల వివరాలు అన్నీ వివరించి గుర్తులు, వాటిపై వేయించిన పేర్లు తెలియపరచాడు. జమిందారు ఫ్రెండ్ ఎస్పీ నీకేమీ భయంలేదు. నువ్వు హాయిగా గుండెలమీద చేతులేసుకుని పడుకో. వాటి సంగతి నాకు వదిలిపెట్టు అంటూ ప్రసాద్‌కి భరోసా ఇచ్చాడు. ఈస్ట్ గోదావరి ఎస్పీకి రింగ్ చేసి ప్లేసు, పోయిన వస్తువుల వివరాలు చెప్పి అన్నిచోట్ల నిఘా వెయ్యమని చెప్పాడు. ఇంకా చాకచక్యంతో రాజమండ్రి లోనే ఆ ఎప్సీ నిఘా బలంగా వేయించాడు. బంగారు వెండి నగలు వస్తువులు శేఠ్ కొట్లో అమ్ముతుండగా పోలీసులు మాటువేసి పట్టేసారు. వస్తువులు, నగలైతే ఒక్కటి బీరు పోకుండా అన్నీ దొరికేసాయి. ఎస్సై వాళ్ళ నాయకుని సెల్ల్లో పెట్టి కొట్టి కొట్టి శోష వచ్చి పడిపోయాడు. వెంటనే హెడ్ కానిస్టేబుల్ లాఠీ తీసుకుని ఉతుకుడు కార్యక్రమం ప్రారంభించాడు. ఇంకా ఎక్కడెక్కడ ఏమేం దొంగతనాలు చేసారని అడిగాడు. ఎన్ని దెబ్బలు కొట్టినా వేరే కన్నం వెయ్యలేదన్న సమాధానమే వాళ్ళ నుంచి వచ్చింది.
కానిస్టేబుల్‌కి లాఠీ ఇచ్చి "నువ్వు కొట్టు. వీళ్ళు మనుషులు కాదు. వీళ్ళవి అసలు శరీరాలే కాదు. అమ్మ! అమ్మ! కుళ్ళబొడుస్తున్నా నిజం చెప్పరే!" ఆశ్చర్యపోయాడు హెడ్. "హెడ్డు బాబూ! ఇవి గాడిద మాంసం, గుర్రం మాంసం తిన్న శరీరాలు. వంటికి గాడిద పాలు మర్దన చేసేటోడు మా అయ్య. అదీ మా బాడీ సీక్రెట్" అన్నాడు ముఠా నాయకుడు. కానిస్టేబుల్ బలంగా నాలుగు దెబ్బలు వేసేటప్పటికే లాఠీ రెండు ముక్కలైంది. ఈలోగా ఎస్పీ వస్తే బకెట్ నీళ్ళు కుమ్మరించాడు నాయకుడి మీద మరో కానిస్టేబుల్. అప్పుడు మరో లాఠీ తెప్పించి ఉతుకుడు కార్యక్రమం తిరిగి ప్రారంభించినా నిజం రాకపోగా పోలిసు నేలబడి పోయాడు. ఎస్పీగారే సెల్లో ప్రవేశించి నలుగుర్ని రేవు పెట్టేసి మెయిన్ నాయకుడిని బూటు కాలితో తన్నితే కొద్దిగా వాడు బాధపడ్డట్టు గ్రహించారు స్టాఫ్.
వెంటనే నలుగురితోపాటు, ఆడ దొంగను లేడీ కానిస్టేబుల్ చేత చితక్కొట్టించారు. నగలు దొరికిన కబురు శ్రీకృష్ణ ప్రసాద్‌కి ఫోన్ చేసి ఎస్పీ చెప్పాడు. మా స్టాఫ్ డిఎస్పీ, ఎస్సై, సి.ఐ, హెడ్‌కానిస్టేబుల్‌తో నలుగురైదుగురు పోలీస్ స్టాఫ్ బయలుదేరి జీపు వేసుకుని నగలు తీసుకొస్తున్నట్లుగా చెప్పారు. పోలిసు జీపులో ప్రసాద్ జమిందారింటికి బయలుదేరారు. పోలిసులు పోయిన వస్తువులన్నిటినీ శ్రీకృష్ణ ప్రసాద్‌కి వివరాలు చెప్పి హేండోవర్ చేసారు. జమిందారు వాళ్ళందరికీ మర్చిపోలేని కమ్మటి భోజనం పెట్టి ఆతిథ్యమిచ్చాడు. అందరూ ప్రసాద్‌కి థాంక్స్ చెప్పి తిరిగి ప్రయాణమయ్యారు. సాయంకాలం ఏదో పనిబడి శ్రీకృష్ణ ప్రసాద్ జమిందార్ రాజమండ్రి వెళ్ళవల్సి వచ్చింది. పనిలో పని అనుకొని సెంట్రల్ జైల్‌కి వెళ్ళాడు. జైలర్ కూడా తెలిసున్న వ్యక్తే. మా కేసు తాలూకు వ్యక్తుల్ని, అదే ముద్దాయిల్ని చూపించగలరా అని అడిగితే, వైనాట్ అంటూ జైలర్ ప్రసాద్‌ని దొంగలుండే చోటుకి తీసుకెళ్ళాడు.
జైలర్ ప్రసాద్‌కి అసలు ఆ నలుగురు దొంగలున్న సెల్, లేడీ దొంగ వున్న సెల్ చూపించాడు. వాళ్ళలో లావుగా ఉన్న దొంగలనాయకుడుతో "ఎలాగుందిరా! మా ఇంట్లో దొంగతనం చేయడం వల్ల పర్యవసానం!"అంటూ దర్పంగా ప్రశ్నించాడు. ఆ ముఠా నాయకుడు సగౌరవంగా "మాది స్టూవర్టుపురం బాబూ! దొరికిందంతా మాదౌతుందా బాబూ! మీ ఇంట్లో కన్నం పారిందనుకున్నాం! అనుకున్నంతసేపు నిలువలేదు ఆనందం. చివరికి ఏదీ మాకు దక్కకపోగా, ఎస్పీ గారి బూటి కాలిదెబ్బలు గుర్తుండిపోయాయంటే నమ్మండి. సూడండి లాఠీలు మా అందరి వంటిమీద నాట్యం చేసాయంటే నమ్మండి" అంటూ ఏడుస్తూ ఆ దెబ్బలు చూపించాడు. అతనితోపాటు మిగిలినవాళ్ళూ చూపించారు ప్రసాద్‌కి. బయటకొచ్చాక వాళ్ళని ఐడెంటిఫై చేసిన అధికారి ఎవరని అడిగి తెలుసుకున్నాడు. అతడొక ఎస్సై. అతను అదే సమయంలో అక్కడే ఉన్నాడు. జైలర్ చూపించగానే అతని దగ్గరకు వెళ్ళి కరచాలనం చేసాడు. నువ్వు చేసినదానికి ప్రతిఫలంగా నీ పేరు పై అధికారులకు రికమండ్ చేస్తాలేవయ్యా! తొందర్లో ప్రమోషన్ కొడుదువుగాన్లే అంటూ, కీపిటప్ అంటూ సంతోషంగా భుజాన్ని తట్టాడు. "ఇందులో నాదేమీ లేదు సార్! నా డ్యూటీ నేను చేసాను సార్! ఒకరి మెప్పు కోసం కాదు. ఇలాగని మిమ్మల్ని నేను హర్ట్ చేస్తున్నానని అనుకోకండి ప్లీజ్" అన్నాడు. ప్రసాద్ " ఇక్కడ గోదావరి నీళ్ళు అటువంటివయ్యా! గోదావరీ తీరంలో ధ్రమం, న్యాయం, నీతి ముప్పేటలై గోదాట్లో పారుతుంటాయ్. సో థ్యాంక్స్" అంటూ జైలర్‌తో కూడా చెప్పి జాతిగుర్రం ఎక్కి తమ గ్రామం వైపు దాన్ని దౌడు తీయించాడు. శ్రీకృష్ణ ప్రసాద్ వెళుతుంటే అక్కడి అధికారులంతా అతనివైపే కన్నార్పకుండా చూసారు. ఆశ్చర్యంగా ఎవరికి వారే జమిందారు జమిందారే అనుకున్నారు.
* * * * *
Friday, March 20, 2009
Subscribe to:
Posts (Atom)